మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాల దృష్ట్యా రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తూ, తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తుందని వచ్చిన సర్వే రిపోర్ట్ లను కూడా పరిగణనలోకి తీసుకుంటే వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా పనిచెయ్యవలసి వస్తే అప్పుడు జగన్ ఏమేం చెయ్యగలుగుతారు అన్నది ఊహిస్తే, అది కూడా తక్కువ బాధ్యతేమీ కాదని అర్థమౌతోంది.
సార్వత్రిక ఎన్నికల సందర్బంలోను, పరిషత్ ఎన్నికల వోట్ల లెక్కింపు సమయంలోను దాడులు జరిగినట్లుగా వచ్చిన వార్తలను పక్కన పెట్టి, అటువంటివి జరగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రభుత్వం నడుస్తుందని ఆశిస్తూ అంచనావేస్తే, అప్పటికీ తెలుగు దేశం పార్టీకి పూర్తి మెజారిటీ లేని పక్షంలో మాత్రం నిర్ణయాలను తీసుకోవటంలో ఇబ్బందులను ఎదుర్కుంటుంది.
అయితే ప్రజలు ఎంత నమ్మి పట్టం కట్టినా, చెక్ పెట్టటానికి ప్రతిపక్షం కూడా అవసరమే. ప్రతిపక్షం ఉన్నదే ప్రశ్నించటానికి కాబట్టి ఆ పనిని ఒక పక్క జగన్, మరో పక్క పవన్ కళ్యాణ్ చెయ్యటం రాష్ట్ర ప్రజల ప్రయోజనం దృష్ట్యా ఆశించదగ్గదే.
చెక్ పెట్టటం ఎందుకంటే, అధికారంలోకి రావటం కోసం కొందరు వ్యాపారవేత్తలు, ఇతర పార్టీల నుంచి పదవిని ఆశించి వచ్చిన కొందరు నాయకులను పార్టీలోకి తీసుకుని వాళ్ళకి కొన్ని వాగ్దానాలు చేసివుండవచ్చు. అధికారం చేపట్టకపోతే అనుకున్న మంచి పనులను కూడా చెయ్యలేరు కాబట్టి అదీ అవసరమే కావొచ్చు కానీ ఆ ముఖమాటం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్నిఇబ్బంది పెట్టవచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి అనుకూలంగా కొన్ని నిర్ణయాలను తీసుకోవలసిన అవసరం పడవచ్చు. అది ప్రజాహితంలో లేని సందర్భంలో ప్రతిపక్షం కచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది.
కాబట్టి అటువంటి పాత్ర కూడా తక్కువదేమీ కాదు. నిజంగా ప్రజా సేవ చెయ్యదలచుకుంటే ప్రతిపక్షంలో ఉండి కూడా చెయ్యవచ్చు. నిజానికి అదే సులభం. ఎందుకంటే ప్రశ్నించటం చాలా సులభం కానీ జవాబు చెప్పటం కష్టం, ఆచరణలో చూపించటం మరీ కష్టమైన పని. పైగా రోజువారీ పనులతో సతమతమయ్యే అధికార పక్షానికి కొన్ని విషయాలలో ఆలోచించే సమయం చిక్కకపోవచ్చు కానీ, అదేమీ లేని ప్రతిపక్షం ప్రతి పనిని, ప్రతి నిర్ణయాన్ని, ప్రభుత్వం చేసే ప్రతి ప్రకటనను, భూతద్దంలో చూసే సమయం కావలసినంతగా ఉంటుంది.
అందువలన ప్రతిపక్షంలో క్రియాశీలంగా పనిచేసినట్లయితే జగన్ ఆ విధంగా కూడా ప్రజల మనసుని చూరగొనే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment